బతుకమ్మ స్ఫూర్తితో నీటిని పొదుపు చేద్దాం : గవర్నర్‌‌‌‌ శివప్రతాప్‌‌‌‌ శుక్లా

బతుకమ్మ స్ఫూర్తితో నీటిని పొదుపు చేద్దాం : గవర్నర్‌‌‌‌ శివప్రతాప్‌‌‌‌ శుక్లా
  • ప్రజలకు గవర్నర్‌‌‌‌ శివప్రతాప్‌‌‌‌ శుక్లా పిలుపు
  • ట్యాంక్‌‌‌‌బండ్‌‌‌‌పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

హైదరాబాద్, వెలుగు: బతుకమ్మ పండుగ స్ఫూర్తితో ప్రకృతిని, జలవనరులను పరిరక్షించుకోవడానికి ప్రతిఒక్కరూ నడుం బిగించాలని గవర్నర్‌‌‌‌ శివప్రతాప్‌‌‌‌ శుక్లా పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌‌‌‌లోని ట్యాంక్‌‌‌‌ బండ్‌‌‌‌పై వైభవంగా నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి, మహిళా శక్తికి నిలువెత్తు ప్రతీక అని కొనియాడారు.

తరతరాలుగా ఈ విశిష్టమైన సంప్రదాయాన్ని సజీవంగా నిలబెడుతూ వస్తున్న మహిళల అంకితభావాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఎల్‌‌‌‌నినో వంటి వాతావరణ మార్పుల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యత ఎంతో పెరిగిందన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో తక్కువ వర్షపాతం నమోదు కావడంతో రాబోయే నీటి ఎద్దడికి ముందస్తు హెచ్చరికగా భావించాలన్నారు.

సమస్య తీవ్రమయ్యే వరకు వేచి చూడకుండా ఇప్పటి నుంచే నీటి పొదుపును అలవాటు చేసుకోవాలని సూచించారు. వర్షపు నీటిని ఒడిసి పట్టడం, ఇంకుడు గుంతల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ, భూగర్భ జలాల పెంపు వంటి చర్యలను ప్రజా ఉద్యమంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. జలసంరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతిఒక్కరి సామాజిక కర్తవ్యమని గుర్తుచేశారు.

మారుతున్న వాతావరణం, నీటి లభ్యతకు అనుగుణంగా రైతులు వ్యవసాయ పద్ధతుల్లో మార్పులు చేసుకోవాలని కోరారు. తక్కువ నీటితో అధిక దిగుబడులు ఇచ్చే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ, శరన్నవరాత్రి, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.